
సులభతరంగా ‘అమ్మ’ దర్శనం
పోలేరమ్మతల్లిని భక్తులు సులభతరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో జాతర బందోబస్తుపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పోలేరమ్మ జాతరకు పకడ్బందీ బందోబస్తు కల్పించినట్లు వెల్లడించారు. సుమారు వెయ్యిమంది పోలీసులతో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తుల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని, నిమజ్జనం, ఊరేగింపులో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పండుగ పోలేరమ్మతల్లి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక కమాండ్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ గీతాకుమారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ ఏవీ రమణ పాల్గొన్నారు.