
నేడే పోలేరమ్మ జాతర
విద్యుద్దీప
కాంతులతో ఆర్చి
విద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయం
వెంకటగిరి (సైదాపురం): వెంకటగిరి పట్టణం జాతరకు సిద్ధమైంది. పోలేరమ్మ ఆలయం వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి సేవకు భక్తజనం తరలివస్తోంది. బుధవారం రాత్రి నగరోత్సవానికి ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ప్రత్యేక రథంపై కొలువుదీరనున్న అమ్మలగన్న అమ్మను కనులారా వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. బుధ, గురువారాల్లో అత్యంత వైభవంగా జరిగే జాతరకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. వెంకటగిరి పట్టణమంతా విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుత్తోంది. పోలేరమ్మ తల్లి బుధవారం రాత్రి జీనుగుల వారి వీధి నుంచి ప్రత్యేక రథంపై నగరోత్సవంగా అమ్మవారి ఆలయం వద్ద చేరుకొని కొలువుదీరనున్నారు. అనంతరం భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన, డీఎస్పీ గీతాకుమారి అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
పుట్టింటి నుంచి మెట్టినింటికి
వెళ్లనున్న పోలేరమ్మ తల్లి
జాతర సంప్రదాయాలకు అనుగుణంగా కుమ్మరింట పోలేరమ్మ తల్లిని ఆడపడుచుగా భావిస్తారు. బుధవారం రాత్రి కుమ్మరులు పుట్ట మట్టిని తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమను తయారు చేసి మొదటి పూజ అక్కడే చేస్తారు. ఆ రోజు రాత్రి భక్తుల దర్శనార్థం రాత్రి 10.30 గంటల వరకు ఉంచుతారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతారు. అనంతరం కాంపాళెంలోని గాలిగంగుల వద్ద తొలుత పూజలు చేసి అమ్మవారిని కుమ్మరింట నుంచి మెట్టినిల్లు అయిన జీనుగుల వారి వీధికి తీసుకెళ్తారు. అక్కడ రజకులు పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మెట్టినింటికి ఆహ్వానం పలుకుతారు. అమ్మవారి ప్రతిమకు కళ్లు, దిష్టి చుక్క పెట్టి బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. అనంతరం రథంపై అమ్మవారిని ఆలయం వద్దకు చేర్చి కొలువు దీరుస్తారు. (నిలుపు) ఈ తంతు మొత్తం బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కొనసాగుతుంది. అనంతరం అమ్మవారిని భక్తులకు దర్శనం కల్పిస్తారు.
ప్రతి ఇంటా పూజలు
వెంకటగిరి రూరల్: బుధవారం ఉదయం నుంచే ప్రతి వీధిలో ‘‘పోలేరమ్మకు మడి బిక్షం పెట్టండి. పోతురాజుకు టెంకాయ కొట్టండి’’ అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తనుంది. ప్రతి ఇంట్లో పసుపు ప్రతిమను తయారుచేసి పూజలు చేస్తారు. అంబలిని నైవేద్యం సమర్పిస్తారు. పోలేరమ్మతల్లి దర్శనార్థం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉచితంతోపాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలను ఏర్పాటు చేశారు. వెంకటగిరి జన జాతరకు బుధ, గురువారాల్లో లక్షలాది మంది తరలిరానున్నారు.

నేడే పోలేరమ్మ జాతర

నేడే పోలేరమ్మ జాతర

నేడే పోలేరమ్మ జాతర