
ఫీజు బకాయిలపై కన్నెర్ర
ప్రభుత్వానికి ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం అల్టిమేటం! పెండింగ్ బకాయిల జాప్యంపై పోరాటానికి అసోసియేషన్ సన్నద్ధం పోరాట కార్యాచరణకు సిద్ధమైన ఏపీ ప్రైవేటు కళాశాలల అసోసియేషన్
తిరుపతి సిటీ : కూటమి ప్రభుత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కన్నెర్ర చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక భరించలేం.. తాడో పేడో తేల్చుకుంటామంటూ అల్టిమేటం జారీ చేసింది. రెండేళ్లుగా జిల్లాలోని సుమారు 108 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఇప్పటి వరకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఒక్క రూపాయి అందకపోవడంతో యాజమాన్యాలు ప్రభుత్వంపై తుది పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో తుది పోరుకు సిద్ధమవుతూ మంగళవారం అన్ని కళాశాల యాజమాన్యాలను అప్రమత్తం చేశాయి.
కళాశాలలను మూత వేయమంటారా...!
జిల్లాలోని ప్రైవేటు కళాశాలలకు ఇప్పటి వరకు సుమారు రూ.650 కోట్లు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. అంటే ఒక్కో కళాశాలకు సుమారు రూ. 3కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసోసియేషన్ డిమాండ్లు ఇవే....
2023 నుంచి 2025 ఏడాది వరకు పెండింగ్ ఆర్టీఎఫ్ నిధులు వెంటనే విడుదల చేయాలి
డిగ్రీ ఫీజులను సవరించి, కొత్త ఫీజుల విధానాన్ని వర్సిటీలకు అప్పగించాలి
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి
కళాశాలలకు అఫ్లియేషన్ 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాలి
ప్రతి ఏడాది అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేయాలి
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో కామన్ అఫిలియేషన్ అమలు చేయాలి
కళాశాల మనుగడ ప్రశ్నార్థకమే
జిల్లాలో ప్రైవేటు కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోట్లలో బకాయిలు ఉండటంతో కళాశాల నిర్వహణ భారమవుతోంది. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో జిల్లాలోని వందల కళాశాల యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. అడ్మిషన్ల విషయంలో ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం వహించడంతో ప్రవేశాలు 50శాతం సైతం దాటడం లేదు. సాధారణ కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. తక్షణం ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలి. లేదంటే రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధర్వంలో తుది పోరుకు సిద్ధమవుతాం.
– పట్నం సురేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్

ఫీజు బకాయిలపై కన్నెర్ర