
గ్రావెల్ లారీ అడ్డగింత
పెళ్లకూరు : మండలంలోని శిరసనంబేడులో మంగళవారం గ్రావెల్ తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని సర్వే నంబరు 287–2పీలో వేలూరు శ్రీనివాసులురెడ్డి, వేలూరు రాధాకృష్ణారెడ్డి, వేలూరు ప్రభాకర్‌రెడ్డికి 8 ఎకరాల పట్టా భూములున్నాయి. అయితే ఇక్కడి భూములను మెగా కంపెనీకి రోడ్డు అభివృద్ధి పనుల కోసం లీజుకు కేటాయించారు. పనులు పూర్తి కావడంతో లీజు సమయం ముగించుకొని కంపెనీ యంత్రాలు తీసుకెళ్లిపోయారు. అయితే గ్రామానికి చెందిన ఓ నాయకుడు అక్కడ మిగిలిపోయిన స్క్రాప్‌తో పాటు సంబంధిత భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టి లారీలతో తరలిస్తున్నారు. దాంతో భూయజమానులు, గ్రామస్తులు కలిసి గ్రావెల్ లారీలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకొని స్వల్ప దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళలు
రేణిగుంట : మండలంలోని పిల్లపాల్యం సమీపంలో రెండు మూడు నెలలుగా రాత్రీ, పగలు తేడా లేకుండా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై విసుగెత్తిపోన పిల్లపాల్యం మహిళలు మంగళవారం ఉదయం రోడ్డెక్కారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఆపాలని ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇంతలో కూటమి నాయకులు ఉలిక్కిపడి ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందేమోనని గ్రామంలోని పెద్ద మనుషులతో చర్చించి హుటాహుటిన మహిళలను వెనక్కి పిలిపించారు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మహిళలను పంపించి వేశారు. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం.
బార్ వద్దు..భద్రత కావాలని మహిళల నిరసన
తొట్టంబేడు : శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ ఆర్చీ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని (బార్) వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్దు.. మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో మద్యం దుకాణం (బార్) ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువుతుందని, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.. ఈ దుకాణం రద్దు చేసే వరకు ప్రతిరోజు నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.

గ్రావెల్ లారీ అడ్డగింత