
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
రేణిగుంట : గత పదేళ్లుగా వంద ఇళ్లలలో తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న తమిళనాడుకు తుత్తుకూడి జిల్లాకు చెందిన తంగ ముత్తు అనే అంతర్రాష్ట్ర దొంగను గాజులమండ్యం పోలీసులు అరెస్టు చేసి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. గాజుల మండ్యం పోలీస్ స్టేషన్‌లో శనివారం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. రేణిగుంట మండలంలో రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసే వ్యక్తిని పట్టుకునే ఉద్దేశంతో నిఘా పెట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. తమిళనాడు ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందితో వెళ్లి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టివేతలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించి నగదు రివార్డును అందించారు. సమావేశంలో సిబ్బంది గోపి, వేణుగోపాల్ , మణి వాసు, రాజేష్, సుబ్రమణ్యం, మురళీ పాల్గొన్నారు.