అన్నదాతపై అలుసెందుకు బాబు? | - | Sakshi
Sakshi News home page

అన్నదాతపై అలుసెందుకు బాబు?

Sep 6 2025 4:28 AM | Updated on Sep 6 2025 4:28 AM

అన్నదాతపై అలుసెందుకు బాబు?

అన్నదాతపై అలుసెందుకు బాబు?

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం గిట్టుబాటు ధరలు లేక, యూరియా అందక అవస్థలు పడుతున్న రైతులు 9న రైతు సమస్యలపై ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలి మీడియా సమావేశంలో భూమన అభినయ్‌రెడ్డి వెల్లడి

తిరుపతి మంగళం : అన్నదాతపై ఎందుకంత చిన్నచూపు చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల రైతు విభాగం అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డితో కలసి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేలా రైతు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అభినయ్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే హామీలను గాలికి వదిలేసిన ప్రజా, రైతు ద్రోహి చంద్రబాబు అన్నారు. రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా ఇవ్వలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువుల కష్టాలు, బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నిలబడే దారుణ పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? అని, ఈ రోజు రైతులు కష్టాలు పడుతున్నారంటే ప్రభుత్వ వైఫల్యం కాదా? అని అభినయరెడ్డి ప్రశ్నించారు.

బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలు

యూరియా, ఎరువులను టీడీపీ, జనసేన నాయకులు దారి మళ్లించి బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నారని భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. బస్తా యూరియా ధర రూ.267 అయితే బ్లాక్‌ మార్కెట్లో రూ. 500కు విక్రయించుకుంటున్నారన్నారు. జగనన్న పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, యూరియా, సబ్సిడీ వేరుశెనగ వంటివి సకాలంలో అందించామని గుర్తు చేశారు. టీడీపీ నాయకుల జేబులు నింపేందుకు రైతుల కడుపుకొడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా పంటల ధరలు పతనమవుతున్నాయని, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుము, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమేనని, అందులో కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారన్నారు.

డబుల్‌ డెక్కర్‌ బస్సు తిప్పిన ఘనత మాదే...

దేశంలో బాంబే తర్వాత తిరుపతి నగరంలో వైస్సార్‌సీపీ పాలనలో డబుల్‌ డెక్కర్‌ బస్సును తిప్పిన ఘనత మాదేనని భూమన అభినయ్‌రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్ష పూరిత రాజకీయాలతో డబుల్‌ డెక్కర్‌ బస్సును మూలన పడవేసిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందన్నారు. అయితే వైజాగ్‌లో చంద్రబాబు, లోకేష్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సును కొత్తగా వారే రాష్ట్రానికి మొదటి సారిగా తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఆ విషయాన్ని ఎల్లో పత్రికలో అహో ఒహో అంటూ రాతలు రాయడం వారికే చెల్లిందన్నారు. తిరుపతిలో ఓ దిక్కూ మొక్కులేని నాయకుడు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్లీ ఫేమ్‌లోకి రావాలని ఆరాట పడుతున్నాడని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా మళ్లీ ఆ పార్టీ పేరు చెప్పుకుని తిరుగుతూ దళారీ వ్యాపారాలు చేసుకుంటున్న దళారి మా వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత నీకుందా అని ప్రశ్నించారు. నీచమైన వ్యక్తిత్వం కలిగిన ఆ వ్యక్తి పేరు కూడా చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రమౌళిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement