
శ్రీసిటీలో ‘స్మైల్ ఎకో’ ప్రారంభం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (శానిటరీ న్యాప్‌కిన్స్) తయారు చేసే ‘స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన పరిశ్రమ శుక్రవారం శ్రీసిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీఎస్‌ఎన్‌ఎల్ మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున పరుచూరి సమక్షంలో లాంఛనంగా పరిశ్రమను ప్రారంభించారు. రూ.20 కోట్ల పెట్టుబడితో స్థాపించబడిన ఈ ప్లాంట్ ఏడాదికి 259.2 మిలియన్ల శానిటరీ న్యాప్‌కిన్లను తయారు చేస్తుందన్నారు. దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దీని ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు ఎగుమతులు చేస్తారన్నారు.
నాడు ఉద్యోగి, నేడు పారిశ్రామికవేత్త
స్థానికుడైన మల్లికార్జున్ నాడు శ్రీసిటీ ఉద్యోగి కాగా నేడు పారిశ్రామికవేత్తగా మారి స్మైల్ ఎకో’ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎండీ మల్లికార్జునను ఈ సందర్భంగా డాక్టర్ సన్నారెడ్డి అభినందించారు. మల్లికార్జున పయనం స్థానిక యువతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ టెలికాం సంస్కరణలలో ప్రముఖ పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి హనుమాన్ చౌదరి చేత ఈ పరిశ్రమ ప్రారంభం కావడం అత్యంత శుభపరిణామం అన్నారు. అనువైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థతో 240 పైచిలుకు పరిశ్రమల స్థాపనతో పాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక ప్రగతికి చొరవ చూపుతున్న శ్రీసిటీ యాజమాన్య కృషిని డాక్టర్ హనుమాన్ చౌదరి ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీలోని పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.