8న ఎస్వీయూలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

8న ఎస్వీయూలో జాబ్‌మేళా

Sep 6 2025 4:28 AM | Updated on Sep 6 2025 4:28 AM

8న ఎస్వీయూలో జాబ్‌మేళా

8న ఎస్వీయూలో జాబ్‌మేళా

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో 8వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, డీ, బీ, ఎం, ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 95338 89902, 79898 10194 సంప్రదించాలని సూచించారు.

ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు

పెళ్లకూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి స్వగ్రామమైన పుల్లూరులో శుక్రవారం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాల్లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి త్వరలో విడుదల కావాలని గ్రామ దేవతకు పూజలు చేసినట్లు చెప్పారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పయాగం చేసి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పూజలు చేశారు. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేకుండా ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌రెడ్డి, మణినాయుడు, వెంకటాచలం, వీరాస్వామిరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

8వ తేదీన డిగ్రీ సీట్ల కేటాయింపు

తిరుపతి సిటీ: జిల్లాలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఈనెల 3వ తేదీతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం వరకు వెబ్‌ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించిన ఉన్నత విద్యామండలి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలలో ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన సోమవారం సీట్లు కేటాయించనుంది. అదేరోజు సంబంధిత కళాశాలల్లో సీట్లు సాధించి విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 9వ తేదీన కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.

6 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి అర్బన్‌ : ఆదాయ వనరు నేపథ్యంలో మద్యం బార్ల కేటాయింపులో జాప్యం లేకుండా కూటమి సర్కారు చకచకా కేటాయింపులు చేస్తున్నారు. జిల్లాలో 32 బార్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో గత నెల 30న 26 బార్లను లాటరీ పద్ధతిలో కేటాయింపు చేశారు. మిగిలిన 6 బార్లను భర్తీ చేయడానికి ఈనెల 14 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఎకై ్సజ్‌ జిల్లా అధికారి నాగమలేశ్వర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 15న కలెక్టరేట్‌లో ఉదయం 8 గంటలకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో బార్ల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఓపెన్‌ కేటగిరికి చెందిన ఆరు బార్లలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, వెంకటగిరి పట్టణ పరిధిలో ఒకటి, గూడూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు, సూళ్లూరు పేట పరిధిలో రెండు బార్ల ఉన్నాయని చెప్పారు. మూడేళ్లపాటు మాత్రమే లైసెన్స్‌ ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌తో పాటు హైబ్రిడ్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకు అయినా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బార్లు వచ్చినా నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 21 ఏళ్లు దాటిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూలైన్‌ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement