
బ్రహ్మాండం!
బ్రహ్మోత్సవం..
త్రిశూలానికి క్షీరాభిషేకం చేస్తున్న పండితులు
హోమపూజలు చేస్తున్న దృశ్యం
కాణిపాకం: కాణిపాక స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు. ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి, బుద్ధి, సమేత శ్రీవినాయకస్వామి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగించి పుష్క రిణి వద్దకు చేరుకున్నారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలలోని తీర్థాలను పుష్కరిణిలో కలిపారు. అనంతరం త్రిశూలానికి పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్స వమూర్తులను మంగళ వాయిద్యాల నడుమున దేవ స్థానం సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు రంగు నీళ్లు చల్లుకుంటూ కోలాహలంగా ఊరేగించారు. తదుపరి యుగశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ యాగమూర్తికి భక్తితో ముగింపు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంలో భాగంగా ఆలయంలోని స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ధ్వజ స్తంభంపై నుంచి మూషక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణ చేశారు.
వైభవంగా వడాయత్తు ఉత్సవం
రాత్రి స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిగ్రహానికి భక్తితో అభిషేకం నిర్వహించి, పెసర పప్పు పాయసం, ఉద్ది వడలు నైవేద్యంగా సమర్పించి వడాయత్తు ఉత్సవాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ పాల్గొన్నారు.

బ్రహ్మాండం!