
శెట్టిపల్లి సమస్య మళ్లీ వాయిదా!
తిరుపతి అర్బన్ : శెట్టిపల్లి భూ సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా మూడు నెలలకు ఓసారి ఇదిగో అదిగో అంటూ 15 నెలలుగా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. తాజాగా కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ 40 రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించారు. లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేబినెట్‌లోనూ చర్చ జరిగినట్లు వెల్లడించారు. ప్రధానంగా శెట్టిపల్లి హౌస్ హోల్డ్ ఓనర్స్‌కి 50 : 50 నిష్పత్తిలో అంటే 50 శాతం తుడాకు, 50శాతం హక్కుదారుడికి, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్స్‌కి 30 :70 నిష్పత్తిలో హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు. 30 శాతం తుడా, 70శాతం రైతుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. మొత్తంగా తుడాకు 65 ఎకరాలు, ప్రభుత్వానికి 90 ఎకరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. శెట్టిపల్లి భూములు తిరిగీ తుడా పరిధిలోకి మార్పు చేశారని చెప్పారు. తుడా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను 225 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 1300 మందికి రెండు సెంట్ల స్థలం వచ్చే అవకాశం ఉందని, మిగిలిన వారికి కూడా రెండు సెంట్లు కేటాయింపు చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. శెట్టిపల్లి గ్రామ ప్రజలకు అన్ని వసతులతో కూడిన లే అవుట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.