
డయేరియా వ్యాప్తిపై పరస్పర ఆరోపణలు
రేణిగుంట : అయిదు రోజులుగా గ్రామంలో డయేరియాకు తాగునీరే కారణమని చెప్పిన అధికారులు ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే తాగునీరు సురక్షితంగా ఉందని డయేరియాకు కారణం తాగునీరు కాదని చెబుతున్నారు. కానీ డయేరియా ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు అధికారులు సమాధానం దాటవేస్తుండడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో డయేరియాతో 40 మంది ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. మరికొంత మంది వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. డయేరియాతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. షిరిడిలో మృతి చెందిన మునిరాజా మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. మండలంలోని ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు అందరూ గ్రామానికి చేరుకొని ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 23 మందిలో పది మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని వైద్యాధికారులు చెప్పారు. మిగిలిన 13 మంది చికిత్స పొందుతున్నారన్నారు. గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతున్నట్లు చెప్పారు. మండల వైద్యాధికారి చక్రపాణి రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభురావు తమ సిబ్బందితో గ్రామంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయిదు రోజులు గడిచినా ఇంత వరకు డయేరియా కలకలానికి కారణం తెలపకుండా అధికారులు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం గడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.