
రాష్ట్రానికి డబుల్ డెక్కర్ బస్సు తీసుకొచ్చిన ఘనత అభిన
తిరుపతి మంగళం : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉండి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి డబుల్ డెక్కర్ బస్సును మొదటిగా తీసుకొచ్చిన ఘనత భూమన అభినయ్‌రెడ్డిదేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. బాంబే తర్వాత డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగరానికి 2023 సంవత్సరంలోనే భూమన అభినయ్‌రెడ్డి తీసుకొచ్చారన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను సైతం కనువిందు చేసేలా డబుల్ డెక్కర్ బస్సు తిరుపతి పుర వీధుల్లో తిప్పారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2.5 కోట్లను భూమన అభినయ్‌రెడ్డి దుర్వినియోగం చేశారంటూ పచ్చపత్రికల్లో విషపు రాతలు రాశారన్నారు. ఆ తర్వాత డబుల్ డెక్కర్ బస్సును డంపింగ్ యార్డ్‌లోని చెత్త కుప్పల వద్ద కూటమి నేతలు పడేశారన్నారు. అప్పుడు తిరుపతికి శోభ రాలేదా? కూటమి నేతలు చేసింది పచ్చ పత్రికలకు కనపడలేదా? అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు వైజాగ్‌లో డబుల్ డెక్కర్ బస్సును చంద్రబాబు, లోకేష్ ప్రారంభిస్తే అదేదో పెద్ద గొప్ప అన్నట్లుగా వైజాగ్‌కు డబుల్ డెక్కర్ బస్సుతో కొత్త శోభ వచ్చిందని అదే పచ్చపత్రికల్లో రాయడం వారి నీచపు రాతలకు నిదర్శనమన్నారు. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా, పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు రాసినా తిరుపతిని రాష్ట్రానికే ఆదర్శంగా అభివృద్ధి చేసిన ఘనత మాత్రం భూమన అభినయ్‌రెడ్డిదేననే విషయం అందరికీ తెలుసునన్నారు.