
టింబర్ ఉడ్ ప్లాంటేషన్‌పై దృష్టిసారించండి
తిరుపతి మంగళం : సాధారణ వ్యవసాయం తరహాలోనే టింబర్ ఉడ్ ఆధారిత ప్లాంటేషన్‌పై దృష్టి సారించి, లాభదాయకంగా మార్చుకోవాలని అటవీశాఖ తిరుపతి సర్కిల్ పీసీఎఫ్ సెల్వం రైతులకు సూచించారు. తిరుపతిలోని బయోట్రిమ్ కార్యాలయంలో బుధవారం బెంగళూరుకు చెందిన ఐసీఎఫ్‌ఆర్‌ఈ– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్‌సైన్స్ టెక్నాలజీ సహకారంతో తిరుపతి అటవీశాఖ జిల్లా రైతులకు నర్సరీల ఏర్పాటు, వెదురు, శ్రీగంధం, ఎర్రచందనం మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, చిత్తూరు పరిధిలో ఎర్రచందనం పెంపకంపై దృష్టిసారించినా, అమ్మకాల్లో అంతర్జాతీయ డిమాండుకు తగ్గట్టు లాభాలు రావడంలేదనో, కటింగ్ పర్మిషన్ ఇబ్బందనో, కొనేందుకు బయ్యర్స్ ముందుకు రావడంలేదనో ఎక్కువగా రైతులు అటువైపు మొగ్గు చూపడంలేదన్నారు. ఎర్రచందనాన్ని కూడా ఒక సాధారణ టింబర్ ఉడ్‌గా భావించి పెంచితే సాధారణ ఉడ్ ట్రీల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. అయితే వెదురు, శ్రీగంధం పెంపకం చేపట్టినా లాభదాయకంగా ఉంటాయన్నారు. ఏటా 5 కోట్ల మొక్కలను నాటించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకుంటే టింబర్ ఉడ్ మొక్కల పెంపకంలో లాభాలను చూడవచ్చునని తెలిపారు. బయోట్రిమ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేందిరన్ మాట్లాడుతూ.. ఏనుగుల వలన నష్టంలేని ఉడ్ బేస్డ్ వెదురు పెంపకాన్ని రైతులు చేపడితే లాభాలు గడించవచ్చునని చెప్పారు. సినిమాలు చూసి ఎర్రచందనం రేటును ఊహించుకుని రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లా హార్టికల్పరల్ అధికారి దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వెదురు పెంపకంపై రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, హెక్టారుకు రూ.32 వేలు రాయితీ రైతులకు అందజేస్తామన్నారు. జిల్లాలో 12 హెక్టార్లలో వెదురు పెంపకం లక్ష్యంగా ఉండేదని ఆసక్తి ఉన్న రైతులు ముందుకు రావాలని సూచించారు. సదస్సులో అసిస్టెంట్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ పవన్‌కుమార్‌రావు, సబ్ డీఎఫ్‌వో నాగభూషణం, ఐడబ్ల్యుటీ శాస్త్రవేత్త లక్ష్మీనరసింహమూర్తిదొరై, ఏసీఎఫ్ సోమశేఖర్, రేంజర్లు లక్ష్మీపతి, లక్ష్మప్ప, రైతులు పాల్గొన్నారు.