
కలుషిత నీటితో కలకలం
రేణిగుంట : మండలంలోని గుత్తివారిపల్లిలో డయేరియా వ్యాప్తి చెంది గ్రామస్తులు ఆసుపత్రి పాలైన తర్వాత అన్ని శాఖల అధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి, పారిశుద్ధ్య పనులు చేసి, బ్లీచింగ్ వేయడం చూసి రోగాలు వస్తేనే అధికారులకు గ్రామాలు గుర్తుకొస్తాయా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గుత్తివారిపల్లిలో సోమవారం నుంచి సుమారు 30 మంది దాకా విరేచనాలు, వాంతులు రావడంతో మంగళవారం ఉదయం వైద్యాధికారులు గ్రామంలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో వైద్య శిబిరం నిర్వహించారు. డయేరియాకు కలుషిత నీరే ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హాస్పిటల్లో బాధితులను పరామర్శించి వైద్యుల ద్వారా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఉన్నా ఇన్ని రోజులు పట్టించుకోని అధికారులు డయేరియా వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి శానిటేషన్ పనులు చేయించారు.
ఆదుకున్న విలేజ్ క్లినిక్
వైఎస్సార్‌పీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఆపదలో ఉన్న సమయంలో ఆదుకుంది. విలేజ్ క్లినిక్‌లో మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రథమ చికిత్సను అందించారు. మాజీ సీఎం ముందు చూపుతో నిర్మించిన విలేజ్ క్లినిక్ ఆపదలో ఉపయోగపడిందని గ్రామస్తులు చర్చించుకోవడం విశేషం.
25మందికి డయేరియా
రేణిగుంట : మండలంలోని గుత్తివారిపల్లిలో 25 మంది డయేరియా బారిన పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు వైద్యాధికారులు మంగళవారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి బాలకృష్ణ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని గ్రామాన్ని సందర్శించారు. ఇన్‌చార్జి ఎంపీడీఓ ప్రభురావు గ్రామంలో శానిటేషన్ పనులు చేయించారు. కలుషిత నీటి వల్లే స్థానికులు డయేరియా బారిన పడినట్లు వైద్యులు తెలిపారు.

కలుషిత నీటితో కలకలం

కలుషిత నీటితో కలకలం