
తాళం పడిందా.. గొళ్లెం విరగాల్సిందే!
తిరుపతి క్రైమ్ : నగరంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గజ దొంగలను మంగళవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్యాం సుందరం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గత నెల 14వ తేదీన బైరాగిపట్టెడిలో నివాసం ఉన్న టీటీడీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు సొంత పనులు నిమిత్తం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. అయితే 18వ తేదీ తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. మంగళవారం ఉదయం మంగళం రోడ్డులోని బొంతాలమ్మ గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఆటోలో ఉండడం గమనించి వారిని అరెస్టు చేశామన్నారు. తిరుపతికి చెందిన అక్కుర్తి నవీన్, డేరంగుల జగదీష్ ఇరువురు ముఠాగా ఏర్పడ్డారన్నారు. మొదటి నిందితుడు నవీన్ తన అనుచరులతో కలిసి 2019 నుంచి 23 వ సంవత్సరం వరకు సుమారు 21 దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తిరుపతి, ఎంఆర్ పల్లి, అలిపిరి, బైరవ, పట్టిన వంటి ప్రాంతాలలోనే కాకుండా శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ పాల్పడే వారిని తెలిపారు. ఇదే క్రమంలో నవీన్‌కు జగదీష్ పరిచయం కావడంతో ఇద్దరూ కలిసి విలాసాల కోసం దొంగతనాలకు పాల్పడేవారు. బైరాగి పట్టడి లో కూడా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారని తెలిపారు. వీరి వద్ద మొత్తం 12.50 లక్షలు విలువ చేసే 151 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో వెస్ట్ పోలీస్ స్టేషన్‌లోని ఓ కేసులో 15 గ్రాములు మరో కేసులో 13 గ్రామాలతో పాటు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 123 గ్రాముల బంగారు కేసులో రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించడంలో సీఐలు చిన్న పెద్దయ్య, ప్రకాష్, శివ కుమార్ రెడ్డి , ఎస్‌ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ ఎంతగానో కృషి చేశారన్నారు.