
ఎస్వీయూ లక్ష్య సాధనకు కృషి
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ స్థాపన లక్ష్యాలను నెరవేర్చే దిశగా కృషి చేద్దామని వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్టార్ ఆచార్య భూపతి నాయుడు పేర్కొన్నారు. మంగళవారం వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 71వ వ్యవస్థాపక దినోత్సవ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉద్యోగ బృందంతో కలిసి ప్రాంగణంలోని టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, మహాత్మా గాంధీ, ఆచార్య గోవిందరాజులు, బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు శ్రీనివాస ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీసీ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ.. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక గల ఎంతో మంది మహనీయుల కలల్ని నెరవేర్చడానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎస్వీయూ వరల్డ్, ఆసియా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం పొందిందన్నారు. క్వాంటం టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు ఎంతో ఉన్నత లక్ష్యంతో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీని స్థాపించారని తెలిపారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. రిటైర్డ్ ఉద్యోగి విజయ్ కుమార్ మిమిక్రీ తో అందరినీ అలరించారు. మరో ఉద్యోగి అన్నమయ్య వేషధారణతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్ చంద్రయ్య, నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుర్రంకొండ శ్రీధర్, నెల్లూరు సుబ్రహ్మణ్యం, పలువురు ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.