
నేడు ఐసర్ 6వ స్నాతకోత్సవం
ఏర్పేడు: మండలంలోని తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్)లో మంగళవారం ఉదయం 9.30 గంటలకు 6వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతాను భట్టాచార్య తెలిపారు. ఐసర్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో నిర్వహించే ఈ వేడుకలో కోర్సు పూర్తి చేసిన మొత్తం 255 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి సత్కరించనున్నట్లు వివరించారు. పట్టాలు అందుకోనున్న విద్యార్థుల్లో 22 మంది పీహెచ్‌డీ విద్యార్థులు, 8మంది ఐపీహెచ్‌డీ విద్యార్థులు, ముగ్గురు ఎంఎస్ విద్యార్థులు, 141 మంది బీఎస్–ఎంఎస్ విద్యార్థులు, 69 మంది ప్రొఫెషనల్ మాస్టర్స్ విద్యార్థులు, ఆరుగురు బీఎస్ విద్యార్థులు, మరో ఆరుగురు బీఎస్సీ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా గోదావరి బయోరిఫైనరీస్ చైర్మన్ సమిర్ సోమైయా, ఐజర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్‌గా ఝిల్లుసింగ్ యాదవ్ పాల్గొంటారన్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.