
మిత్రఖేదం!
‘‘ సర్కారు బడుల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యా సామగ్రి పంపిణీ చేశాం. ఆకట్టుకునేలా బ్యాగులను తయారు చేయించాం. విద్యార్థుల సౌకర్యానికి పెద్దపీట వేశాం’’ అంటూ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాగులను చూపిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. అయితే వారం.. పది రోజులకే బండారం బట్టబయలైంది. ప్రధానంగా స్కూలు బ్యాగుల నాణ్యత.. మంత్రి మాటల్లోని డొల్లతనం ప్రజలకు అర్థమైంది. కొద్ది పుస్తకాల బరువుకే సంచులు చిరిగిపోవడంతో విద్యార్థులకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది.
వరదయ్యపాళెం: మండలంలోని ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్‌ల ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూలు బ్యాగు, యూనిఫామ్ పంపిణీ చేశారు. మండలంలోని మొత్తం 59 సర్కారు బడుల్లోని 3,646 మంది విద్యార్థులకు కిట్లను అందజేశారు. అయితే వారం, పది రోజులకే చాలా మంది విద్యార్థుల బ్యాగులు చిరిగిపోయాయి. చిరిగిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకురావడానికి పిల్లలు అవస్థలు పడుతున్నారు. పలువురు ఇప్పటికే ప్రత్యామ్నాయంగా బ్యాగులు కొనుగోలు చేసుకుని పుస్తకాలను స్కూల్‌కు తీసుకెళుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేసిన విద్యాకానుక కిట్లలో నాణ్యత లోపించి డొల్లతనం బయట పడింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కేవలం ప్రచార ఆర్బాటమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద విద్యార్థులు ఇస్తున్న కిట్లలో కూడా కక్కుర్తి పడడమేంటని ప్రశ్నిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన స్కూలు బ్యాగులు ఎంతో నాణ్యతగా ఉండేవని, ఏడాదంతా ఒకే బ్యాగులో పుస్తకాలు తీసుకువెళ్లిన ఏమాత్రం చిరిగేవి కాదని గుర్తు చేసుకుంటున్నారు.
కుట్లు వేసినా ప్రయోజనం శూన్యం
ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగుల నాణ్యతను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాగుల తయారీకి ఉపయోగించిన మెటీరియల్ పూర్తిగా నాసిరకంగా ఉండడంతో కుట్లు వేసినా చిరిగిపోతున్నాయని పలువురు టైలర్లు చెబుతుండడం గమనార్హం.
నాణ్యత లేని విద్యార్థి మిత్ర కిట్‌లు వారం.. పది రోజులకే చిరిగిపోయిన బ్యాగులు అవస్థలు పడుతున్న పిల్లలు నాసిరకమని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు