
మఠం భూమిపై ‘పచ్చ’గద్దలు
శ్రీవారికి పరమభక్తుడైన హథీరాం బావాజీ మఠానికి చెందిన భూములపై పచ్చ నేతలు కన్నేశారు.. ఇప్పటికే 30 మంది పేదలు నిర్మించుకున్న రేకుల షెడ్లను నిర్దాక్షిణ్యంగా కూలదోసేశారు. అక్రమంగా ఆ భూమిలోకి ప్రవేశించి యథేచ్ఛగా స్థలం చదును చేసేశారు. గూడు కోల్పోయిన బాధితులను పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. ఖాకీలు సైతం పచ్చమూక దౌర్జన్యానికి సహకారం అందించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో 1.09ఎకరాల భూమిపై చంద్రగిరి మండలానికి చెందిన ఒక టీడీపీ నేత కన్నుపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయనకు స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి అండగా నిలబడటంతోనే పేదల ఇళ్లు కూల్చివేశారని వెల్లడిస్తున్నారు. ఎంతో కాలంగా ఆ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపై దౌర్జన్యం చేసి ఆక్రమించారని స్పష్టంచేస్తున్నారు. మఠం భూములపై ఎవరికీ ఎలాంటి హక్కులు లేనప్పటికీ పోలీసులు మాత్రం టీడీపీ నేతలకు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. పైగా పచ్చనేతల వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, పేదల వద్ద అన్ రిజిస్టర్ డాక్యు మెంట్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని విమర్శిస్తున్నారు. మఠం భూమిపై ఎవరికీ హక్కు లేనప్పుడు, ఇప్పటికే ఆ స్థలంలో ఇళ్లు కట్టుకున్న వారిని కాదని, టీడీపీ నేతలు ఎలా ఆ అందులోకి ప్రవేశిస్తారని ప్రశ్నిస్తున్నారు. 30 మంది ఇళ్లను కూల్చి ఆ భూమిని కాజేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యంగా ఆక్రమించి చదును చేయడం దుర్మార్గమని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మఠం అధికారులు సైతం ఈ విషయంలో పేదల పక్షాన నిలబడాలని కోరుతున్నారు.
రూ.6కోట్ల విలువైన స్థలం చదును
30 మంది పేదల ఇళ్లు ధ్వంసం
బాధితుల గోడు పట్టించుకోని పోలీసులు