
తండ్రీ కొడుకుల నిర్వాకం.. విద్యార్థుల పాలిట శాపం
● మాజీ మంత్రి ఆర్కేరోజా
నగరి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. జగనన్న పాలనలో ప్రతి విద్యార్థికీ ఒక్క ఏడాది కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ కష్టం రాకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. కానీ ప్రస్తుత పాలనలో, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో జిల్లాలో సుమారు 600 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వక ఉన్నత విద్య అయిన ఎంటెక్ అవకాశాన్ని కోల్పోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెడుతూ, పథకాన్ని నీరుగార్చడంతో పాటు వారి భవిష్యత్తునే నాశనం చేస్తున్నారన్నారు. ‘మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది’ అని డైలాగ్‌లు చెప్పిన వాళ్లు నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్ బటన్ నొక్కడానికి ఎందుకింత కష్టపడుతున్నారన్నారు. పాలన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.