
టీటీడీకి విరాళంగా ఎలక్ట్రిక్ స్కూటర్
తిరుమల: విజయవాడకు చెందిన క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీలు శ్రీనివాస్, చక్రవర్తి సోమ వారం రూ.1.05లక్షల విలువైన బిజినెస్ ఎక్స్‌పీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీటీడీకి విరాళంగా అందించారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సమక్షంలో శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరికి తాళాలు అందించారు.
తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు
తిరుపతి అర్బన్ : పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తిరుపతి ఆర్‌టీసీ డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ ఉదయం 4 నుంచి ప్రతి 15 నిముషాలకు ఒక బస్సును తిరుపతి నుంచి నడపనున్నట్లు వివరించారు. అలాగే తిరువణ్ణామలై నుంచి 9వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుగు ప్రయాణానికి సర్వీసులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
నేడు పాలిటెక్నిక్‌లో
స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆయా గ్రూప్‌లలో ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య మేరకు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు, ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు సైతం ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావచ్చని అధికారులు వెల్లడించారు.
టీటీడీ ఆలయాలకు ‘సౌభాగ్యం’
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ పరిధిలోని 51 ఆలయాల్లో ఈ నెల 8వ తేదీన వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న మహిళలకు సౌభాగ్యం పేరుతో గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు సౌభాగ్యం వస్తు సామగ్రిని ఆయా ఆలయాలకు చేర్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో సౌభాగ్యవతులకు గాజులు, పద్మావతి అమ్మవారి కుంకుమ అందించనున్నట్లు వెల్లడించారు.

టీటీడీకి విరాళంగా ఎలక్ట్రిక్ స్కూటర్