
రక్తమోడినా తరగని అభిమానం
లాఠీ కాఠిన్యం..
● అభిమాననేత కోసం వెళ్లిన అతడిపై లాఠీ చార్జ్ ● తలపగిలి రక్తం కారుతున్నా లెక్క చేయని వైనం ● పోలీసుల దుశ్చర్యపై అధినేత ఆగ్రహం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన రాష్ట్ర వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్‌రెడ్డికి వైఎస్‌ఆర్ అన్నా.. ఆ కుటుంబమన్నా అతనికి ప్రాణం.. మహానేత రాజశేఖరరెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా.. పది మందికీ అన్నం పెడతాడు; రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకుంటాడు.. జననేత జగనన్న అంటే అతనికి మహాఇష్టం.. రాజన్న బిడ్డగానే కాదు.. తన అభిమాన నాయకునిగా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతడు అభిమాననేత పర్యటనకు ఉత్సాహంగా వెళ్లాడు. అయితే అడుగడుగునా పోలీసుల అవరోధాలు, ఆంక్షలు అధిగమించి వెళ్లిన అతడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. లాఠీచార్జ్ చేసి తల పగగొట్టారు. వివరాలు..మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాన్ని నిలదీయడానికి బంగారుపాళెంకు బుధవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకుని శశిధర్‌రెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం 5 గంటలకే తిరుపతి నుంచి బయలుదేరి పోలీసుల ఆంక్షలన్నీ అధిగమించి బంగారుపాళెం వెళ్లిన శశిధర్‌రెడ్డి అక్కడకు వచ్చిన వేలాది మంది జనంలో ఒక్కడిగా జగనన్న రాక కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జగనన్న కాన్వాయ్ వస్తుండగా జనం తోపులాటలో తాను దగ్గరకు వెళ్లి కళ్లారా జగనన్నను చూడాలని తపించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. రాక్షసత్వంగా వ్యవహరించి తలపై లాఠీలతో బలంగా కొట్టారు. ఆ లాఠీ దెబ్బకు తలపగిలిన శశిధర్‌రెడ్డి ముఖంపై రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అలాగే ముందుకొచ్చాడు.. ఇది చూసి జగనన్న చలించిపోయారు. కాన్వాయ్ దిగి అతని వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గాయపడ్డ శశిధర్‌రెడ్డిని దగ్గరకు తీసుకుని తలకు తగిలిన గాయం చూసి మరింత ఆవేదనతో పోలీసుల తీరుపై అక్కడే ఉన్న ఎస్పీ మణికంఠ చందోలుపై మండిపడ్డాడు. తన కోసం వచ్చిన కార్యకర్తల తలలు పగలగొట్టడమేమిటని ప్రశ్నించారు. అనంతరం శశిధర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. శశిధర్‌రెడ్డి కూడా తన అభిమాన నాయకున్ని చూశానన్న ఆనందంలో తలకు తగిలిన గాయా న్ని లెక్క చేయకపోవడం విశేషం! ఆ తరువాత కొంతసేపటికి అక్కడే ఉన్న అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నాడు.

రక్తమోడినా తరగని అభిమానం