
జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు కేంద్రం సంసిద్ధం
● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖకు స్పందన
తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది. ప్రతి జిల్లాలో ఒక్కో జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన రెండు జిల్లాలలో ఒకటైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1986–87 నుంచే జవహర్ నవోదయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అయితే 2022 ఏప్రిల్ 3న కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో ఇప్పటికీ నవోదయ విద్యాలయం లేదని, దీని స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని, అలాగే నూతన పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా ఆయా ప్రమాణాలకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. మరోవైపు– రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలలో జవహర్ నవోదయ విద్యాలయల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దీనికి అవసరమైన భూ కేటాయింపులు చేయాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.