
‘శతాధిక’ సంబరం
చిట్టమూరు : మండల పరిధిలోని మొలకలపూడి గ్రామానికి చెందిన సంక్రాంతి రమణయ్య అనే వృద్ధుడు మంగళవారంతో వందేళ్లు పూర్తి చేసుకున్నాడు. రమణయ్యకు నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100లో అడుగు పెట్టడంతో కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. తాను నెహ్రూ కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నానన్నాడు. అయితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తనకు ఎంతగానో నచ్చిందన్నారు.
కుక్ కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: వన్ స్టాప్ సెంటర్‌కు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన మల్లీపర్పస్ స్టాఫ్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా పీడీ వసంత బాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 14వ తేది లోపు దరఖాస్తులు కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఇవ్వాలని లేదా పోస్టులో పంపవచ్చన్నారు. నెలకు వేతనం రూ.13 వేలు ఉంటుందని చెప్పారు. 18–42 ఏళ్లలోపు మహిళలు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీలు అయితే రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.200 డీడీ లేదా చెక్కు రూపంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి పేరిట చెల్లించాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం ఐసీడీఎస్ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
ఉపాధి సిబ్బందిపై కేసు
– విధుల నుంచి తొలగింపు
కలువాయి(సైదాపురం) : ఉపాధి ఉద్యోగులపై సస్పెన్షన్, కేసు నమోదు అయిన ఘటన కలువాయిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కలువాయి మండలంలో గతంలో పనిచేసిన ఈసీ శ్రీనివాసులు, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ప్రసన్న, ప్రసాద్ అనే ఉద్యోగులు రూ. 56 లక్షల అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ చేశారు. నెల్లూరు డ్వామా అధికారులు ఈ నలుగురు ఉద్యోగులను పూర్తిగా విధుల నుంచి తొలగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయమై నెల్లూరు డ్వామా కార్యాలయం నుంచి కలువాయి మండల పరిషత్ కార్యాలయానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం.