
నకిలీ పట్టాలతో భూ ఆక్రమణలు
వెంకటగిరి (సైదాపురం) : అక్రమాలు..అరాచకాలు..దౌర్జన్యాలు.. భూ కబ్జాలకు వెంకటగిరి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దుండగలు విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు.
వసూళ్ల సంస్కృతికి శ్రీకారం
అక్రమాలు, దౌర్జన్యాలు, వసూళ్లు వెంకటగిరిలో శ్రీకారం చుట్టాయన్నారు. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి మెనూ కార్డు ప్రకారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రామ్‌కుమార్ విమర్శించారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఖాళీగా జాగా కనిపిస్తే యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని విమర్శించారు. స్థానికంగా ఉండి విశ్రాంతి పొందిన తహసీల్దార్ రాత్రి.. పగలు తేడా లేకుండా నిరంతరం కూటమి నేతల కన్నుసన్నల్లో సేవలు అందించారని ఆరోపించారు. దొంగ పట్టాలను సృష్టించి అమాయకులకు విక్రయాలు చేసిన దళారులతో పాటు విశ్రాంతి పొంది ఇంట్లో ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారుల మాటలు విని దొంగ పట్టాల భూములను ఎవ్వరూ కొని మోసపోవద్దని వెంకటగిరి ప్రజలకు ఆయన సూచించారు. వైఎస్సార్‌సీపీ బీసీ నేత డాక్టర్ బొలిగర్ల మస్తాన్‌యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనప్పటి నుంచి వెంకటగిరిలో భూ ఆక్రమణలు పెట్రేగిపోతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ కూడా కూటమి నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, పద్మశాలీ కార్పొరేష్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, మహిళా విభాగం కార్యదర్శి కాటూరు రామతులసి, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్లు రవికుమార్‌యాదవ్, వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి సదానందరెడ్డి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఇంటిపై దాడి హేయం
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి