
బంగారుపాళెంలో జన సునామీ
● కూటమి కుయుక్తులు.. ఆంక్షల కంచె పటాపంచలు ● అభిమాన నేతను చూసి మురిసిపోయిన అక్కచెల్లెమ్మలు ● మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం
చిత్తూరు అర్బన్/ కాణిపాకం/ పలమనేరు/ బంగారుపాళెం: ఒకే ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి వందలాది మంది ఖాకీలు. కానీ వేలాది మంది అభిమానం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. చివరకు ఏ సంబంధం లేని సామాన్యులను సైతం అడ్డుకున్నారు. అడగుడగునా ఆంక్షల చట్రం విధించినా ఏ మాత్రం అవి పనిచేయ లేదు. మామిడి రైతులను పరామర్శించడానికి బుధవారం బంగారుపాళెంకు వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన దిగ్విజయంగా ముగిసింది.
రెడ్‌జోన్‌గా బంగారుపాళెం
వాహనాల్లో బంగారుపాళెంకు వెళుతున్న పలువురు నాయకులను మహాసముద్రం టోల్‌గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలందర్నీ అదుపులోకి తీసుకుని చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అసలు ఏ బస్సు కూడా బంగారుపాళెం లోపలకు వెళ్లకూడదని, జాతీయ రహదారి మీదుగా కూడా వెళ్లకూడదని హుకూం జారీ చేశారు. బంగారుపాళెం బస్సు టికెట్లే ఇవ్వలేదు. పలమనేరు టికెట్టు కొనుక్కున్న ప్రయాణికులు హైవేల వైపు దిగి కిలో మీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహాసముద్రం టోల్ గేటు వద్ద బస్సుల్లోకి ఎక్కిన పోలీసులు ఎవరైనా బంగారుపాళెంకు వెళుతున్నారా..? అని అడుగుతూ.. వెళుతున్నామంటే ప్రయాణికులను సైతం అదుపులోకి తీసుకున్నారు. టోల్ గేటు వద్ద దించేశారు.
పలుచోట్ల లాఠీ చార్జ్
వైఎస్.జగన్‌ను చూడడానికి పలుచోట్ల ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడ్డారు. వీళ్లను తరమివేయడానికి పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. చాలా చోట్ల ప్రజలు పోలీసుల మాటల్ని లెక్కచేయకపోవడంతో లాఠీలతో చావ బాదారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సామాన్యులు సైతం గాయపడ్డారు. మరికొన్ని చోట్ల ప్రజల్ని నెట్టేయడంతో తోపులాటకు కింద పడిపోయారు.
నాయకులపై జులుం
వైఎస్సార్‌సీపీ నాయకులపై చాలా చోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు డా.సునీల్, వెంకటేగౌడ, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తమ కార్యకర్తలతో హెలిప్యాడ్ వద్దకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. తాను మాజీ ఎంపీ అని రెడ్డెప్ప చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, వెంకటగౌడ్, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, కృపాలక్ష్మి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బంగారుపాళెంలో జగన్ జాతర
మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన జన జాతరను తలపించింది. బంగారుపాళెం చుట్టూ పోలీసులు విధించిన ఆంక్షలు పటాపంచలయ్యాయి. పోలీసుల అడ్డగింతలు, నోటీసులతో జనం ఉలిక్కిపడ్డారని అధికార పక్షం, అధికారులు అనుకున్నారు. మార్కెట్ ప్రాంగంణం, రోడ్డు మార్గంలో జనం పలుచగా ఉన్నారని తెగ సంబరపడ్డారు. ఆ తర్వాత ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. వీరి రాకతో మార్కెట్ ప్రాంతమంతా నిండిపోయింది.
కర్ణాటక సరిహద్దు నుంచి ఆంక్షలు
బంగారుపాళెంకు జనం వెళ్లకుండా పోలీసులు కర్ణాటక సరిహద్దుల్లోని గంగవరం మండలం, కుప్పం ప్రాంతంలో వీకోట, బైరెడ్డిపల్లి, జాతీయ రహదారిలో గాంధీనగర్ వద్ద భారీగా మోహరించారు. బంగారుపాళెంకు వెళ్లే గ్రామీణ రహదారులను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు.

బంగారుపాళెంలో జన సునామీ

బంగారుపాళెంలో జన సునామీ

బంగారుపాళెంలో జన సునామీ