
లోక్ అదాలత్‌లో 2352 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 2352 కేసులు పరిష్కారం అయినట్లు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ గురునాథ్ తెలిపారు. పరిష్కారమైన కేసులలో 371 కోర్టుల్లో పెండింగ్ ఉన్న సివిల్ , క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద కేసులు, వివాహ సంబంధాల కేసులు, తదితర కేసులు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే 1981 జరిమానాలు చెల్లించే క్రిమినల్ కేసులను పరిష్కరించి నిందితులకు 60 లక్షలా 25 వేల వంద రూపాయలు జరిమానా విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10:30 గంటలకు తిరుపతి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. కేసుల పరిష్కారం కోసం ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 8 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. జడ్జి గురునాథ్‌తో పాటు ఐదవ అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి విజయసారధిరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ, ఇతర జూనియర్ సివిల్ జడ్జిలు గ్రంధి శ్రీనివాస్ ,శ్రీకాంత్ , సత్యకాంత్ కుమార్, సంధ్యారాణి, కోటేశ్వరరావు ఈ లోక్ అదాలత్ బెంచ్‌లకు అధ్యక్షులుగా వ్యవహరించి కేసులను పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్‌లో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, బ్యాంకు, బీమా, ఆర్టీసీ ఇతర వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదం.. పట్టుబడ్డ ఎర్రచందనం
నాయుడుపేటటౌన్: పట్టణ పరిధిలోని అగ్నిమాపకశాఖ కార్యాలయం సమీపంలో రహదారిపై బైక్‌ను ఢీకొని ఎర్రచందనం తరలిస్తున్న వాహనం శనివారం పోలీసులకు పట్టుబడింది. ఫారెస్ట్ డీఆర్వో కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. వెంకటగిరి వైపు నుంచి వస్తున్న కారు పట్టణ పరిధిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదుట రహదారిపై వెళుతున్న బైక్‌ను ఢీకొంది. అక్కడ యూనిఫామ్‌లో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేటప్పటికే కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. కారు వెనుక డోర్‌లో తెరిచి చూడగా ఎర్ర చందనం దుంగలు ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వాహనం అప్పగించినట్లు డీఆర్వో తెలిపారు. 237 కేజీలకు పైగా ఉన్న 46 ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనం విలువ రూ. 3 లక్షలు వరకు ఉంటుందన్నారు.అటవీశాఖ రేంజ్ అధికారి రమణయ్య పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్వో వెల్లడించారు.