
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ సర్కిల్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,221 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 42,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాయం కంటే ముందు వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓతోపాటు వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరేట్ సిబ్బంది సూచిస్తున్నారు.
రేపటి నుంచి పీ–4 రీసర్వే
తిరుపతి అర్బన్ : ప్రభుత్వం చేపట్టిన పీ–4 పాలసీలో రెండో దశ కింద రీసర్వేను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి జీరో ప్రావర్టీ కింద జిల్లావ్యాప్తంగా 80,324 కుటుంబాలను గుర్తించారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఈ కుటుంబాలను దత్తతకు అప్పగించాలని లక్ష్యం నిర్దేశించారు. అయితే కుటుంబాల సంఖ్యలో ఎక్కువగా ఉండడంతో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. అనంతరం ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 కుటుంబాలను కలెక్టర్ దత్తత తీసుకున్నారు. మిగిలిన కుటుంబాలను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సేవా సంస్థలకు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం.
29 వరకు ‘నవోదయ’ దరఖాస్తుకు గడువు
తిరుపతి ఎడ్యుకేషన్:జాతీయ స్థాయిలో 2026– 27విద్యాసంవత్సరానికి సంబంధించి నవోదయ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 29వ తేదీ ఆఖరు గడువని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్షను డిసెంబరు 13న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు.