
తిరుపతికి మరో ‘వందే భారత్’
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతికి మరో వందేభారత్ రైలు రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ కొత్త రైలును విజయవాడ–బెంగళూరు వయా తిరుపతి మధ్య నడిపేందుకు రూట్ నిర్ణయించారు. కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు, నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఎప్పటి నుంచి పట్టాలపైకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సమయం ఆదా
విజయవాడ నుంచి చైన్నెకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే శాఖ మేలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోచ్‌లు సమస్య కారణంగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఇందులో బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల సమయం ఆదా కానుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది.
రూట్ షెడ్యూల్ ఇదీ..
కొత్త వందేభారత్‌కు రైలుకు 20711 నంబర్ కేటాయించారు. అలాగే రూట్ షెడ్యూల్ మేరకు ఈ రైలు విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45 గంటలకు చేరుకుంటుంది. అనంతరం చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం, 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు బయలుదేరి కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది.
వందే భారత్ రైలు