
నగదు చెల్లించలేదని నిరసన
వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం సమీపంలోని రెడ్డిగుంట వద్ద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన దళితుల భూములను తమిళనాడుకు చెందిన కొందరు భూస్వాములు కొనుగోలు చేశారు. సుమారు 60 మంది రైతులు 60 ఎకరాలను ఏడాది క్రితం విక్రయించారు. ఎకరా రూ.17 లక్షల చొప్పున కొనుగోలు చేసిన భూస్వాములు, ఒక్కో రైతుకు రూ.15 లక్షలు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మిగిలిన రూ.2 లక్షల సొమ్మును చెల్లిస్తామని నమ్మబలికారు. అయితే ఈ ఏడాది గడిచిపోయినా పెండింగ్ నగదు చెల్లించకనే కొనుగోలు చేసిన భూముల్లో ప్రహరీగోడ పనులను చేపట్టారు. బుధవారం ఈమేరకు బాధిత రైతులు అక్కడకు వెళ్లి నిర్మాణ పనులు చేపట్టుకోవాలని పనులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయి నగదు చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు అక్కడే నిరసన తెలిపారు.