
జాతీయస్థాయి చెస్ పోటీలకు శ్రీగురువర్షిణి
తిరుపతి ఎడ్యుకేషన్ : నగరానికి చెందిన చెస్ క్రీడాకారిణి ఒంటి శ్రీగురువర్షిణి జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికై ంది. విశాఖపట్నంలో ఈ నెల 12, 13వ తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్–15 ఓపెన్ అండ్ గరల్స్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతికి చెందిన చెస్ క్రీడాకారిణి ఒంటి శ్రీగురువర్షిణి పాల్గొంది. మొత్తం 7 రౌండ్లకు 6 పాయింట్లతో 4వ స్థానం సాధించి రూ.5 వేలు నగదు బహుమతి, ట్రోఫీని అందుకుంది. అలాగే ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీగురువర్షిణిని కోచ్ కాకినాడ ప్రసాద్ అభినందించారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
చిల్లకూరు: మండలంలోని కాకువారిపాళెం సమీపంలో ఉన్న సొనకాలువ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన గారా అవినాష్ (25) తన అమ్మమ్మ గ్రామమైన కాకువారిపాళేనికి ఆదివారం రాత్రి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిని తరువాత అతను ఇంట్లో లేక పోవడంతో బయటకు వెళ్లి ఉంటాడని అతడి అమ్మమ్మ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఉదయం సొన కాలువ వైపు బహిర్బూమికి వెళ్లిన వారు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు.వారు ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి గ్రామంలో కొంత మంది మధ్య వివాదం నెలకొనడం మృతుడు వారి అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి, అక్కడ మృతి చెందడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించినట్లు తెలిసింది.