
డీఎస్సీకి 26,501 మంది దరఖాస్తు
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 26,501 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 16వ తేదీతో దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ముగిసింది. జిల్లాలో 1,478 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 26,501 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మహిళలే అత్యధికం
జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో మహిళలే అత్యధికంగా ఉండడం విశేషం. 26,501 మంది దరఖాస్తు చేసుకోగా అందులో మహిళలు 16,348 మంది, పురుషులు 10,153 మంది ఉన్నారు. అయితే కొందరు అభ్యర్థులు తమ అర్హతలను బట్టి పలు సబ్జెక్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ విధంగా జిల్లాలో 45,221 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఒక్క పోస్టుకు 31 మంది వరకు పోటీ
అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు 31 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ డీఎస్సీకి అత్యధికంగా పోటీ ఉండడంతో అభ్యర్థులు పుస్తకాలకు అతుక్కుపోయారు. కొందరు కోచింగ్ సెంటర్లలో, మరికొందరు ఇళ్లల్లో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
మెలికలతో పలువురికి నష్టం
కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌లో ఊహించని విధంగా మెలికలు విధించింది. ఈ మెలికల వల్ల జిల్లాలో దాదాపు 6 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించి, టెట్‌లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. అయితే, ఇదే టెట్‌లో జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ గెజిట్‌కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
కులాల వారీగా దరఖాస్తులు ఇలా..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో కులాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ గ్రేడ్–3 అభ్యర్థులు అత్యధికంగా 7,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓసీలో 2,856, బీసీ–ఏలో 4 వేలు, బీసీ–బీలో 3,790, బీసీ–సీలో 101, బీసీ–డీలో 2,570, బీసీ–ఈలో 1,661, ఎస్సీ గ్రేడ్–1లో 4, ఎస్సీ గ్రేడ్–2లో 1,872, ఎస్సీ గ్రేడ్–3లో 7,997, ఎస్టీలో 1,650, ఈడబ్ల్యూఎస్‌లో 1,664, పీహెచ్ పరిధిలో వీహెచ్ 134, హెచ్‌హెచ్ 57, ఓహెచ్ 595, ఎంఐ 11 మంది దరఖాస్తు చేసుకున్నారు.