
ఘనంగా ముగిసిన జానపద జాతర
తిరుపతి కల్చరల్: ప్రజాకళావేదిక, ఎస్వీయూ విద్యార్థుల సంక్షేమం, సాంస్కృతిక వ్యవహారాల సంచాలకుల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎస్వీయూలోని సెనేట్ హాల్లో చేపట్టిన మన పల్లె జానపద జాతర శనివారం ఘనంగా ముగిసింది. రెండో రోజు ఏపీ, తెలంగాణ రాష్టాల నుంచి సుమారు 300 మందికిపైగా కళాకారులు పాల్గొని జానపద గేయాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్, అతిథులుగా గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ప్రముఖ కవి, ప్రిన్సిపల్ డాక్టర్ సి.నారాయణస్వామి, సినీ గీత రచయిత కవి, సురేంద్రరొడ్డ, రుయా ఆస్పత్రి డాక్టర్ రోజారమణి, కల్చరల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, జానపద కళారుడు వేలూరు జగన్నాథం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను, కళాకారులను ప్రజాకళా వేదిక నిర్వాహకుడు జయపాల్ ఘనంగా సత్కరించారు. ప్రజాకళా వేదిక ప్రతినిధులు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, కేఎం.రత్నం, రెడ్డిప్రసాద్, తెలంగాణకు చెందిన కట్ల శ్రీనివాసులు, ప్రజానాట్య మండలి పాండురంగారావు, లాలయ్య పాల్గొన్నారు.