
రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: 11 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు పచ్చజెండా ఊపింది. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా దరఖాస్తులు స్వీకరించనుంది. కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారితోపాటు బియ్యం కార్డులో సభ్యుల విభజన, పేర్లు చేర్పులు, తొలగింపులు, కార్డులు సరెండర్ చేయడం, చిరునామా మార్పులు, ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు సంబంధించి ఏడు అంశాలకు అవకాశం కల్పించింది. ఈ సమస్యలున్న వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రూల్స్ ఇవీ
రూరల్ ప్రాంతాల్లో నెలకు ఆదాయం రూ.10 వేల లోపు, అర్బన్ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలు లోపు, మాగాణి భూమి మూడు ఎకరాల లోపు, మెట్ట భూమి 10 ఎకరాల లోపు, విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లకు లోపు, ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారు, ఇన్‌కంట్యాక్స్ చెల్లించేవారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అర్హులు కాదని అధికారులు తేల్చి చెప్పారు.