● ఫిర్యాదు తీసుకోని పోలీసులు
తిరుపతి రూరల్: మండలంలోని తిరుచానూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన వేలంలో దౌర్జన్యం చేసి ప్రత్యర్థుల టెండరు ఫారాలు, డీడీలు లాక్కున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుచానూరుకు చెందిన దేవేందర్ రెడ్డి, దూర్వాసులు రెడ్డి పంచాయతీ ప్రయివేటు టూరిస్టు బస్టాండు టెండరు వేసేందుకు వెళ్లగా పంచాయతీ కార్యాలయం ముందున్న కూటమి నేతలు అడ్డగించి టెండరు ఫారాలు, డీడీలు, జీఎస్‌టీ కాపీలను తీసుకుని వెళ్లినట్టు తెలిపారు. తమను టెండరు వేయనీయకుండా అడ్డగించి బలవంతంగా తమ వద్ద నుంచి రూ.40లక్షలకు సంబంధించిన బ్యాంకు డీడీలను లాక్కుని వెళ్లిన సాయి రాయల్, కిషోర్ రెడ్డి, శ్రీధర్‌నాయుడు మరో ముగ్గురు వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తమ డీడీలను ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు స్వీకరించడానికి మొగ్గు చూపని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆ డీడీలు ఎవ్వరు చింపలేదని, వాటిని తెప్పించి అందజేస్తామని చెప్పి బాధితులకు నచ్చజెప్పినట్టు సమాచారం.
వ్యక్తిత్వ వికాసంలో
అధ్యాపకులే కీలకం
తిరుపతి సిటీ: విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర ఉంటుందని ఎస్వీయూ వీసీ అప్పారావు పేర్కొన్నారు. ఎస్వీయూ కల్చరల్ అఫైర్స్ స్టూడెంట్ వెల్ఫేర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, సెట్విన్ డైరెక్టర్ మోహన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పద్మావతి మహిళా కళాశాల, ఎస్వీయూ రెండు వేదికల్లో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సైకాలజిస్ట్ శ్రీనివాస్ వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యాప్ చైర్మన్ రవినాయుడు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పద్మావతి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నారాయణమ్మ, ఎస్వీయూ ప్రిన్సిపల్స్ నరసయ్య, సుబ్బారావు, కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ ఆచార్య మురళీధర్, ఊతని శరత్ బాబు, చంద్ర ప్రకాష్, రంజిత్ కుమార్, ఎస్వీయూ ఫార్మసీ కళాశాల, పద్మావతీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.