● 46 రోజుల నిరవధిక నిరసనకు తెర ● తాత్కాలికంగా సమ్మె విరమించినట్లు ప్రకటించిన జూడాలు
తిరుపతి సిటీ:ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు ఎట్టకేలకు నిరవధిక సమ్మెను విరమించారు. అన్ని వైద్య విభాగాల్లో జూడాలకు ఇస్తున్న స్టయిఫండ్‌కు సమానంగా తమకూ గౌరవేతనం ఇవ్వాలని 46 రోజులుగా తరగతులు బహిష్కరించి, సమ్మె బాట పట్టి పశువైద్య విద్యార్థులు గురువారం సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.10500కు పెంచుతూ జీఓ జారీ చేయడంతో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు వీసీ రమణకు, వర్సిటీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీంతో వర్సిటీ డీన్ వీరబ్రహ్మయ్య, కళాశాల అసోసియేట్ డీన్ జగపతి రామయ్య సమ్మె చేస్తున్న విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి, నిరసనను విరమింప జేశారు.అనంతరం జూడాలు మాట్లాడుతూ ప్రభుత్వం యూజీ విద్యార్థులకు రూ.25 వేలు, పీజీకి రూ.50 వేలు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.75 వేలు పెంచితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెంచిన వేతనంతో తాము సంతోషంగా లేమని, ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తున్నామని, తమ న్యాయపరమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు.
సోమవారం నుంచి తరగతులు ప్రారంభం
46 రోజలుగా వెటర్నరీ కళాశాల తరగతి గదులు మూతపడి నిర్మానుష్యంగా మారాయి. విద్యార్థులు సమ్మె విరమణతో సోమవారం నుంచి యథావిథి గా తరగతులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ సంవత్సరం ముగింపు దశలో ఉండడంతో సిలబస్, పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణపై అధికారులు మరింత దృష్టి సారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.