● డిప్యూటీ మేయర్ ఎన్నికలో హింసపై విచారణ ● 14 మంది కూటమి నేతలకు నోటీసులు ● నిందితులను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం?
తిరుపతి తుడా : తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో జరిగిన హింస, కిడ్నాప్ వ్యవహారంలో విచారణ మొదలైంది. ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈమేరకు నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని డీజీపీకి స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో బుధవారం విచారణ ప్రారంభించారు. ముందుగా అల్లర్లలో పాల్గొన్న 14 మంది టీడీపీ, జనసేన నేతలకు నోటీసులు జారీ చేశారు. దీంతో నాడు అల్లర్లకు పాల్పడిన కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది.
అల్లరిమూకలపై చర్యలు!
డిప్యూటీ మేయర్ ఎన్నికను కూటమి నేతలు అపహస్యం చేశారు. అధికారం అండతో అరాచకం సృష్టించారు. మహిళా కార్పొరేటర్లను కూడా బండ బూతులు తిట్టి పైశాచికానందం పొందారు. దళిత ఎంపీ గురుమూర్తితో దురుసుగా ప్రవర్తించారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకోకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. దీనిపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. మానవ హక్కుల ఉల్లంఘన, దళిత ప్రజా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగించడం వంటి అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని పక్కల నుంచి కూటమి నేతల హింసాత్మక ధోరణి విచారణ మొదలైంది. దాడులు, కిడ్నాప్‌లకు పాల్పడిన వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే అల్లరి మూకలను స్పష్టంగా గుర్తించేలా వైఎస్సార్‌సీపీ సైతం ఆధారాలను సేకరించింది. దీంతో నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విచారణ అనంతరం అల్లరి మూకలను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
కార్పొరేటర్లకు బెదిరింపులు
విచారణ ప్రక్రియ మొదలవడంతో కొంతమంది టీడీపీ, జనసేన నేతలు కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. తమపై దాడి చేయలేదని, తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని విచారణలో చెప్పాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఓ కార్పొరేటర్ మీడియాకు తెలిపారు. మీ భవనాలను కూల్చేస్తాం, భవిష్యత్తులో కేసులు పెడతామంటూ హెచ్చరించడాన్ని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస, కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎంపీ గురుమూర్తి తెలిపారు. నాడు విధుల్లో ఉన్న పోలీసు అధికారుల జాబితాతో పాటు అల్లరిముకల హింస ఘటనలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు, పేపర్ క్లిప్పింగులను ఇప్పటికే కేంద్ర హోంశాఖ, మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించినటర్ల వెల్లడించారు. ఎఈ విచారణలో పోలీసులు నిష్పక్షపాతంగాా వ్యవహరించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను గుర్తించాలన్నారు. ఆ ప్రకారం సమగ్ర నివేదికను అందించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని తెలిపారు. విచారణలో పక్షపాతం చూపితే చట్టపరంగా మరింత ముందుకు వెళతామని హెచ్చరించారు. అవసరమైతే సీబీఐ ఎంకై ్వరీ కోరేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతలు వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్‌కు మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులను సంప్రదించారు. ఓటు వేసేందుకు వస్తున్న క్రమంలో తమతో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని వెల్లడిస్తున్నారు. నగర మేయర్‌తో కూడా దురుసుగా ప్రవర్తించారని వివరిస్తున్నారు. ‘‘ఏయ్ మేయర్నే ఎత్తుకెళ్లిపోతే సరిపోదా’’ అంటూ కేకలు వేశారని ప్రస్తావిస్తున్నారు.