
పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనది
తిరుపతి అర్బన్: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనదిగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అమరజీవి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆదివారం బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోత్స్న నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు. ఆయన 1901 మార్చి 16న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవియై మహాపురుషుడిగా నిలిచారన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందని వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దేవేంద్ర రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు.