కన్నతండ్రి ‘మూగ’రోదన | - | Sakshi
Sakshi News home page

కన్నతండ్రి ‘మూగ’రోదన

Sep 9 2023 12:42 AM | Updated on Sep 9 2023 3:24 PM

- - Sakshi

నగరి: మున్సిపల్‌ పరిధి ధర్మాపురం వద్ద జాతీయ రహదారి శుక్రవారం ఉదయం రక్తసిక్తమైంది. ఏక కాలంలో నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో వాహనాల్లో ప్రయాణించేవారు చెల్లాచెదురై రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. అకస్మాత్తుగా ఈ సంఘటన జరగడంతో వెనుకవైపున వస్తున్న వాహనాల్లో వచ్చేవారు ఉలిక్కిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. సీఐ సురేష్‌ కథనం మేరకు.. ధర్మాపురం వద్ద జాతీయ రహదారి సిబ్బంది తమ టాటాఏస్‌ వాహనాన్ని రోడ్డుపై ఉంచి నిర్వహణ పనుల నిమిత్తం జనరేటర్‌ మరమ్మతులు చేస్తుండగా తిరుపతి నుంచి చైన్నెకి వెళుతున్న సిమెంటు లారీ అదుపు తప్పి టాటాఏస్‌ వాహనాన్ని వేగంగా ఢీకొంది.

అదేసమయంలో నగరి నుంచి పుత్తూరు వైపుగా వస్తున్న కారును, బైకును కూడా ఢీకొంది. ఏక కాలంలో నాలుగు వాహనాలు ప్రమాదానికి గురికావడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఉమేష్‌ (3) సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. మిగిలిన వారిని ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మిట్టపాళెం గ్రామానికి చెందిన భూపాలన్‌ (29), నితిన్‌ (4), తమిళనాడు వేలూరుకు చెందిన కన్నన్‌ (50) మృతిచెందారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన తిరునావుక్కరసు (32), విల్లుపురానికి చెందిన మణికంఠన్‌ (23), హరికృష్ణ (21), అలందూర్‌పేటకు చెందిన దినేష్‌ (18), మిట్టపాళెంకు చెందిన నీలావతి (26)ని తిరుపతి రూయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నీలావతి మృతిచెందగా, తిరునావుక్కరసు పరిస్థితి విషమంగా ఉంది.

పుట్టింటింకి చేరుకోకనే..
భూపాల్‌ కుటుంబం వారం కిందటే కొత్తింటిలో చేరింది. పిల్లల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. భూపాలన్‌ భార్య నీలావతి పుట్టింటికి వెళ్లాలని కోరడంతో పిల్లలు ఇద్దరినీ, భార్యను తీసుకుని పుత్తూరు మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో మృత్యువు లారీ రూపంలో వారిని కాటేసింది. కాగా భూపాలన్‌కు తల్లి, అవ్వ, తమ్ముడు ఉన్నారు.

బతుకు తెరువుకు వచ్చి
తమిళనాడు వేలూరుకు చెందిన తండ్రీ కొడుకులు కన్నన్‌ (50), తిరునావుక్కరసు (32) బతుకు బండిని నడిపేందుకు జాతీయరహదారి పనులకు వెళుతున్నారు. పేద కుటుంబం కావడంతో వీరిద్దరి సంపాదనపైనే కుటుంబం ఆధారపడి ఉంది. రోడ్డుపై మార్కింగ్‌ వేసే పనులను ఉపాధిగా ఎంచుకున్నారు. ప్రమాదంలో తండ్రి కన్నన్‌ మృతిచెందగా, తిరునావుక్కరసు పరిస్థితి విషమంగా ఉంది.

హుటాహుటిన చేరుకున్న యంత్రాంగం
ప్రమాదం జరిగిన సంగతి తెలిసిన వెంటనే డీఎస్పీ రవికుమార్‌, ఆర్డీవో సుజన, సీఐ సురేష్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అదొక సామాన్య కుటుంబం. ఉన్నంతలో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ భర్తకు చేదోడుగా ఉండే భార్య, ముద్దులొలికే ఇద్దరు బిడ్డలు. ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు. అందరూ ఈర్ష్యపడేలా జీవిస్తూ వచ్చిన ఆ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులుబాసింది. ఇంటి నుంచి ఆనందంగా బైక్‌పై బయలుదేరిన వారు మళ్లీ విగతజీవులుగా రావడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు బతుకుదెరువు కోసం జాతీయ రహదారిపై వైట్‌ మార్కింగ్‌లు వేసే పనిని ఎంచుకున్న తండ్రీ, కొడుకుల సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఇలా ఓ ప్రమాదం రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది.

కన్నతండ్రి ‘మూగ’రోదన
మిట్టపాళెంలో కుమార్తె నీలావతి ఇంటి వద్దే ఉన్న ఆమె తండ్రి మునస్వామి వీరి వెంటే మరో ద్విచక్ర వాహనంలో తన స్వగ్రామం వేణుగోపాలపురానికి బయలు దేరాడు. అతను వెనుకవైపు వస్తుండగా ముందువైపు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తన కళ్లముందే కుమార్తె, అల్లుడు, మనవళ్లు రక్తసిక్తమై పడివుండడం చూసి చలించిపోయాడు. తన వివరాలు చెప్పి ఎవరినైనా పిలుద్దామన్నా పుట్టుకతో మూగవాడు కావడంతో ఎవరికీ సమాచారం అందించలేక అయినవాళ్లను చూస్తూ ఆర్తనాదాలు పెట్టాడు. కాగా నీలావతి తల్లి చిన్నతనంలోనే టపాకాయల పేలుళ్లలో చనిపోయింది. పినతల్లి పెంపకంలోనే పెరిగింది. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు.

మంత్రి ఆర్కేరోజా దిగ్భాంత్రి
మండలంలోని మిట్టపాళెం గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో మంత్రి ఆర్కేరోజా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement