
విశేషాలంకరణలో రథంపై కొలువైన స్వామివారు
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం వైభవంగా రథోత్సవం నిర్వహించారు. సర్వాలంకారభూషితుడైన అనంత తేజోమూర్తి రథాన్ని అధిరోహించగా, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారి రథ సేవకులుకు, భక్తులకు మజ్జిగ, మంచినీరు, పానీయాలతో పాటు విసన కర్రలు వితరణ చేశారు. దారి పొడవునా భక్తులు మిరియాలు, కలకండను స్వామి వారి రథంపై చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామి వారి ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు అశ్వవాహనం అధిరోహించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, కంకణభట్టార్ ఏపీ శ్రీనివాస దీక్షితులు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ రవికుమార్, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయులు పాల్గొన్నారు.

రథంపై ఊరేగుతున్న గోవిందరాజస్వామివారు