
గేటు కాంట్రాక్టర్‌కు నగదు అందిస్తున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
● చంద్రగిరిలో చెవిరెడ్డి మార్కు సేవ
● ప్రైవేట్ బస్టాండ్ ఫీజు చెల్లించిన మోహిత్ రెడ్డి
● హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులు
చంద్రగిరి(తిరుపతి రూరల్) : చంద్రగిరి నియోజకవర్గంలోని ఆటో కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అండగా నిలిచారు. పంచాయతీలు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేసే గేటు రుసుము లేకుండా, ఉచితంగా రవాణా, పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పాకాల, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఇప్పటికే ఆటో కార్మికులు ఎలాంటి గేటు ఫీజు చెల్లించకుండా వాహనాలను నడుపుకునేలా చర్యలు చేపట్టారు. తాజాగా చంద్రగిరి పంచాయతీ పరిధిలో ఆటోలను ఉచితంగా తిప్పుకునే వెసులుబాటు కల్పించారు. గేటు వసూళ్లకు అనుమతి పొందిన గుత్తేదారుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.7.10 లక్షలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్మికుడు తమ కుటుంబ సభ్యుడేనని తెలిపారు. అందుకే కార్మికులను ఆదుకున్నామన్నారు. అనంతరం ఆటో కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమకు గేటు ఫీజు భారం తప్పించిన మోహిత్‌రెడ్డిని ఆటో డ్రైవర్లు గజమాలతో సత్కరించారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వాటిల్లినా, పండుగ వచ్చినా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా ఉంటున్నారని వెల్లడించారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆటో కార్మికులకు యూనిఫామ్‌ను వితరణగా అందించారు.