
చెరువు గట్టున శ్రావణ్ మృతదేహం
తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్తున్న ఓ యువతి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన అలిపిరి నడక మార్గంలో శుక్రవారం చోటుచేసుకుంది. తిరుమల పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన దివ్య(18) ఇంటర్ పూర్తిచేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు నడుచుకుంటూ బయలుదేరారు. గాలిగోపురం సమీపంలో వేగంగా నడుచుకుంటూ వచ్చి కూల్ డ్రింక్ తాగడంతో గుండె ఆగి అక్కడికక్కడే మృతి చెందింది.
యువకుడి ఆత్మహత్య
రేణిగుంట : మండలంలోని తూకివాకం చెరువులో పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గాజులమండ్యం ఎస్‌ఐ ధర్మారెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాలు.. ఏర్పేడు మండలం జింకలమిట్టకు చెందిన శరవణకుమార్ అలియాస్ శ్రావణ్ (38) కొన్నేళ్ల కిందట నాగేశ్వరి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం రేణిగుంట బుగ్గవీధిలో నివసిస్తున్నారు. శ్రావణ్ స్థానిక పోస్టాఫీస్ వీధిలో మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతని భార్య నాగేశ్వరి సీఆర్‌ఎస్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో శ్రావణ్ కొన్ని నెలలుగా మొబైల్ షాపును మూసేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గురువారం రాత్రి సినిమాకు వెళుతున్నట్లు భార్యకు చెప్పాడు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం తూకివాకం చెరువు వద్ద శ్రావణ్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. చెరువు గట్టున క్రిమిసంహారక మందు సీసా, కూల్‌డ్రింక్ ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

శ్రావణ్ (ఫైల్)