వలకు చిక్కిన ఆస్కార్‌ జిలేబీ చేప

- - Sakshi

బుడ్డ పక్కిల నుంచి ఉలసల వరకు.. జిలేబీల నుంచి బొమ్మిడాయిల వరకు.. కట్ల నుంచి కొర్రమీనుల వరకు.. గండి నుంచి గడ్డిమూస వరకు.. బంగారు తీగ నుంచి వంజరం వరకు.. వివిధ రకాల చేపలు. అరుదైనవి.. రుచికరమైనవి.. సహజవాతావరణంలో భారీ సైజ్‌లో పెరిగినవి.. చూస్తేనే చవులూరించేవి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేవి.. ఆహారప్రియుల జిహ్వచాపల్యాన్ని పెంచేవి.. మత్స్యకారులకు కాసుల వర్షం కురిపించేవి.. నిత్యం వేలాదిమందికి జీవనోపాధిని కల్పించేవి అరణియార్‌ జలాశయంలోని చేపలు. మత్స్యసంపదకు కేరాఫ్‌గా మారింది ఈ ప్రాజెక్టు. ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు నిల్వ ఉండడంతో జలపుష్పాలకు జీవం పోస్తోంది.

సాక్షి, తిరుపతి డెస్క్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అరణియార్‌ జలాశయం విశేష చేపలకు ప్రసిద్ధి. ఈ ప్రాజెక్టులో 50 గ్రాముల నుంచి 50 కిలోల బరువు చేప కూడా జీవిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాల కారణంగా కొత్తనీరు చేరడంతో చేపల పెంపకం మరింద ఊపందుకుంది. అరుదైన చేపలు జలాశయంలోకి వచ్చిచేరాయి. ఇందులో ఆస్కార్‌ మీనం పసుపు, బంగారు వర్ణంలో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అందుబాటులో వివిధ రకాలు..
జలాశయంలో కట్ల, రోహు, మ్రిగల, గ్రాస్‌ గడ్డి చేప, బంగారుతీగ, జిలేబీ, ఫైలెట్‌ జిలేబీ, నాటు పక్కిలు, ఉలసలు, బుడ్డపక్కిలు, కొర్రమీనులు, క్రాస్‌ బీడింగ్‌ జిలేబీ, రూప్‌చంద్‌, జెల్లలు ఇలా పలు రకాలు పెరుగుతున్నాయి. 0.25 కేజీ సైజుతో రొయ్యలు కూడా దొరుకుతున్నాయి. రిజర్వాయర్‌లోకి వరద వచ్చినప్పుడు మత్స్యకారులకు భారీ చేపలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కొప్పేడుకు చెందిన ఓ మత్స్యకార్మికుడి వలలో 26 కిలోల చేప పడింది. నీరు తగ్గిపోతున్నప్పుడు జలాశయం తీరంలో ఏర్పడే గుంతల్లో కొర్రమీనులు లభిస్తున్నాయి. వీటిని మత్స్యకారులు కిలో రూ.200 నుంచి 250కి అమ్ముతున్నారు. వ్యాపారులు కిలో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. మిగిలిన చేపలు కిలో రూ.100 నుంచి రూ.150కే లభిస్తున్నాయి.

వందల కుటుంబాలకు జీవనోపాధి
అరణియార్‌లో చేపలు పెంపకం వల్ల పిచ్చాటూరు, నిండ్ర, కేవీబీ పురం, మండలాల్లోని వందలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది. వీరిలో కొందరు చేపలు పట్టేవాళ్లు ఉంటే మరి కొందరు వాటిని బయటకు తీసుకువెళ్లి అమ్ముకునే వాళ్లు ఉన్నారు.

1982లో మత్స్యకేంద్రం ఏర్పాటు
అరణియార్‌లో చేపలు ఉత్పత్తిని పెంపొందించడానికి 1982లో మత్స్యకేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో చేప పిల్లలు పెంచేందుకు 19 తొట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 నుంచి 20 లక్షల చేప పిల్లలను పెంచుతారు. వాటిని అరణియార్‌తో పాటు చుట్టు పక్కల చెరువుల్లో వదులుతుంటారు. 

భలే డిమాండ్‌
అరణియార్‌ చేపల రుచికి చేపల ప్రియులు ముగ్ధులవుతుంటారు. జాలర్లు చేపలతో ప్రాజెక్టు గట్టుపైకి రావడమే ఆలస్యం. ఎగబడి మరీ కొనుగోలు చేసేస్తుంటారు. పిచ్చాటూరుతో పాటు తమిళనాడు, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల వారు సైతం ఇక్కడ నుంచి చేపలను తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో డిమాండ్‌ ఎక్కువ.

ఆస్కార్‌ జిలేబీ
అరణియార్‌ ప్రాజెక్టులో అరుదైన ఆస్కర్‌ జిలేబీ సోమవారం జాలర్ల వలకు చిక్కింది. పిచ్చాటూరు ఎస్టీ కాలనీకి చెందిన మారయ్య విసిరిన వలలో ఈ చేప పడింది. దీనిపై మత్స్యశాఖ అధికారి నరేంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు సమీపంలోని శేషంపేటలో శేఖర్‌ అనే రైతు గత ఏడాది కలర్‌ చేప పెంపంకం చేపట్టాడన్నారు. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శేఖర్‌ చేపల గుంట మునిగిపోయింది. అందులోని చేపలు కొన్ని అరణియార్‌ జలాశయంలోకి చేరాయని తెలిపారు. అవే అప్పుడప్పుడు జాలర్లకు చిక్కుతున్నట్లు వెల్లడించారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top