పిక్నిక్‌వెళ్లి తిరిగిరాని లోకాలకు..

Young Boy Passaway Tragedy In khammam - Sakshi

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): సుభాష్‌నగర్‌కు చెందిన వెంకటనర్సయ్య, తిరుపమ్మల రెండో కుమారుడు తెల్లబోయిన కల్యాణ్‌ యాదవ్‌(24) పాలిట మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం పెద్ద చెరువు అలుగు గుండం..మృత్యుగండంగా మారింది. మిత్రుడి జన్మదినం సందర్భంగా ఆదివారం తన బాల్య స్నేహితులు నలుగురితో కలిసి చెరువు వద్దకు పిక్నిక్‌కు వెళ్లాడు. అంతా సరదాగా కలియ తిరిగారు. మిగిలిన వారు అక్కడే వంట చేస్తుండగా కల్యాణ్‌ కొంత సమయం అలుగు వద్ద ఈత కొట్టాడు.

మిగతా వారు తమకు ఈత రాదని..సమీపంలోనే వంట పనులో నిమగ్నమయ్యారు. భోజనం వండేశాక..వీరు పదే పదే కేకలు వేసినప్పటికీ రాలేదు. అలుగుకు ఎదురీదే క్రమంలో ఉధృతికి భీమునిగుండంలో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండడం, దరి దొరక్క అందులో మునిగిపోయాడు. పూర్తిస్థాయిలో ఈత రాకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సోమవారం అతడి మృతదేహం లభ్యమైంది.

వద్దని ఎంత చెప్పినా వినకుండా స్నేహితుడు అరవింత్‌ పుట్టిన రోజు వేడుక చేసుకుంటామని వెళ్లాడని, ఇప్పుడు విగత జీవిగా వచ్చాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. స్నేహితులు, బంధువుల రోదనలతో సుభాష్‌నగర్‌లో విషాదం నెలకొంది. భీముని, రాముని గుండాలకు ఇల్లెందు ప్రాంతం నుంచి యువకులు ఎక్కువగా పార్టీలు, పిక్నిక్‌లకంటూ వెళుతూ..ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏడు బావుల జలపాతం వద్ద గత పదేళ్ల కాలంలో పదిమంది వరకు మృతి చెందారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top