గజగజ మొదలైంది! రాష్ట్రంలో ఒక్కసారిగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

Weather Update: Increased Cold Intensity In Telangana - Sakshi

రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌ లోపే..

అత్యల్పంగా మెదక్‌లో 13.6 డిగ్రీలు

రానున్న మూడురోజులు పెరగనున్న చలితీవ్రత

సాక్షి, హైదరాబాద్‌: రాత్రిపూట బయటికి రావాలంటే గజగజ వణికే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వరుస వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోపగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సాధారణం కంటే తక్కువగా...
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 13.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అటుఇటుగా నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే భారీగా తగ్గాయి. హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.2 డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో 5.6, మెదక్‌లో 5.4. నల్లగొండలో 3.6 డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యాయి. 

29 నుంచి ‘ఈశాన్య’ వర్షాలు
నైరుతి రుతుపవనాలు దాదాపు దేశమంతటా ఉపసంహరణ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈనెల 29న బంగాళాఖాతం మీద, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది.

వీటి ప్రభావంతో ఆగ్నేయ ద్వీపకల్ప భారతంలో ఈనెల 29 నుంచి ఈశాన్య రుతుపవన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రానికి ఈశాన్య, తూర్పు దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తప్ప ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top