ఒకే నెలలో ఇన్ని పరీక్షలా?  | Unemployed attempt to attack TSPSC | Sakshi
Sakshi News home page

ఒకే నెలలో ఇన్ని పరీక్షలా? 

Aug 11 2023 5:54 AM | Updated on Aug 11 2023 5:54 AM

Unemployed attempt to attack TSPSC - Sakshi

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రూప్‌–2 అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌/గన్‌ఫౌండ్రి: గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ గురువారం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగ అభ్యర్థులు ప్రయత్నించారు. వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు నిరసన గళంతో కదం తొక్కారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించగా మరికొందరు కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో ఆందోళనకు దిగారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ స్వయంగా వచ్చి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్లబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. వీరికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. ఆగస్టులో గురు కుల, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, ఒకేసారి నాలుగు పరీక్షలు నిర్వహిస్తే ఎలా సిద్ధం కావాలని ప్రశ్నించారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన గ్రూప్‌–2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. కాగా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి అభ్యర్థులను అక్కడ నుంచి పంపించి వేశారు. 

ఉదయం నుంచీ ఉద్రిక్తత 
గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని పరీక్షలు దాదాపుగా ఒకే సమయంలో నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కొందరు సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. అయితే కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే గురువారం టీఎస్‌పీఎస్సీ ముట్టడికి టీజేఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పిలుపునిచ్చాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో ఉదయం నుంచీ ఉద్రిక్తత నెలకొంది. ఓయూ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కోదండరాంతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అద్దంకి దయాకర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ తదితరులు నిరుద్యోగులకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

గ్రూప్‌–2 పరీక్షల వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ 
గ్రూప్‌–2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సీహెచ్‌ చంద్రశేఖర్‌తో పాటు 149 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్‌ లెక్చరర్‌.. తదితర నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్‌–2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జూన్‌ 26న, జూలై 24న రెండుసార్లు టీఎస్‌పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించలేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement