TSRTC: ప్ర‌యాణికుల‌కు టీఎస్ఆర్టీసీ గూడ్‌ న్యూస్‌.. భారీ ఆఫర్‌

TSRTC Special Concessions For Reservation Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్ర‌యాణికుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. ముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌యాణికుల‌కు ప్ర‌త్యేక రాయితీల‌ను ప్ర‌క‌టించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది.

ఆ మేర‌కు ఆన్‌లైన్ ప్యాసెంజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయం ఉన్న అన్ని స‌ర్వీస్‌ల‌కు ఈ రాయితీ వ‌ర్తిస్తుంద‌ని టీఎస్ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఈ స‌దుపాయానికి ప్ర‌యాణికుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్‌లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
చదవండి: తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు 

"రాబోయే రోజుల్లో శుభ‌కార్యాలు, పెళ్లిళ్లు, పండుగ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌జ‌లపై ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీల‌ను ప్ర‌యాణీకులు స‌ద్వినియోగం చేసుకుని సంస్థ‌ను ఆద‌రించాలి. సుర‌క్షిత, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం ఆర్టీసీ బ‌స్సుల్లోనే సాధ్యం.

ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ విధానానికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌యాణీకుల‌కు ర‌వాణా సేవ‌లను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి త‌గిన కృషి జ‌రుగుతోంది" అని టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సంద‌ర్శించాలని వారు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top