TSRTC: దావణగెరెకు టీఎస్‌ఆర్టీసీ కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌

TSRTC New Super Luxury Service From Hyderabad To Davangere - Sakshi

బస్సును ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌

హైదరాబాద్‌: ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటకలోని దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్ , ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సిందనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. మియాపూర్‌ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్‌ నుంచి రూ. 840 చార్జీగా సంస్థ నిర్ణయించింది. 

హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం ఈ కొత్త సర్వీస్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''మధ్య కర్ణాటకలోని దావణగెరెకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిమాండ్‌ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను ఏర్పాటు చేశాం. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకుని ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి." అని సూచించారు. ప్రస్తుతం కర్నాటకలోని బెంగళూరు, రాయచూర్‌, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతుండటం శుభసూచికమన్నారు. 

దావణగెరె సర్వీస్‌ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని, టికెట్‌ బుకింగ్‌ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రయాణికులకు సూచించారు. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. 

ఈ సర్వీస్‌ ప్రారంభోత్సవంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్‌, సీటీఎం (ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌, డీవీఎం రాజు, మియాపూర్‌-1 డీఎం రామయ్య, సీఐ సుధ, డ్రైవర్లు రవీందర్‌, కర్ణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top