బిల్లులు కట్టని సంస్థలకు ఎన్పీడీసీఎల్‌ షాక్‌

TSNPDCL Is Shock To Companies That Do Not Electricity Pay Bills - Sakshi

పరిశ్రమలు, సంస్థలపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగం

ఆస్తులను అటాచ్‌ చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ 

15 రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు

సాక్షి, హైదరాబాద్‌: భారీ మొత్తంలో విద్యుత్‌ బిల్లులు బకాయిపడిన పలు పరిశ్రమలు, వ్యాపార సంస్థలపై ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) కొరడా ఝుళిపించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టాన్ని ప్రయోగించింది. రెవెన్యూ శాఖ సాయంతో వాటి ఆస్తులను అటాచ్‌ చేసుకొని వేలం వేసేందుకు చర్యలు ప్రారంభించింది. విద్యుత్‌ బిల్లుల బకాయిలను చెల్లించనందున వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు పరిశ్రమలు, సంస్థల ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ స్థానిక మండల తహసీల్దార్లు తాజాగా ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేశారు.

సంబంధిత పరిశ్రమలు/సంస్థలకు చెందిన భవనాలు, ఖాళీ స్థలాలు, యంత్రాలు, ఇతర ఆస్తుల జాబితాను ఈ నోటిఫికేషన్లలో పొందుపరిచారు. ఈ జాబితాను టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా మొత్తం బకాయిలను ఆయా సంస్థలు వడ్డీ, ఇతర చార్జీలతో సహా చెల్లించకుంటే ఆస్తులను వేలం వేసి విక్రయించడం ద్వారా బకాయిలను టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ వసూలు చేసుకోనుంది. మంచిర్యాలలోని మంచిర్యాల సిమెంట్‌ ఫ్యాక్టరీ రూ. 10.35 కోట్ల బిల్లులను బకాయిపడగా ఆ పరిశ్రమకు చెందిన 165 ఎకరాలకుపైగా స్థలాలను అటాచ్‌ చేసినట్లు నోటీసుల్లో తహసీల్దార్లు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top