గందరగోళం ఉంది గడువు ఇవ్వండి.. టైమ్‌ ప్లీజ్‌

TS Govt Land Regularization Process Ambiguous In Telangana - Sakshi

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో అస్పష్టత

సందేహాలు తీర్చి.. దరఖాస్తుల సమయం పెంచాలని విజ్ఞప్తులు

నేటితో ముగుస్తున్న దరఖాస్తుల గడువు.. 

ఇప్పటికీ మార్గదర్శకాలపై తేల్చని ప్రభుత్వం 

గ్రామీణ ప్రాంతాల దరఖాస్తులు స్వీకరించేందుకు ‘నో ఆప్షన్‌’ 

కేవలం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధికే పరిమితం! 

ఇప్పటివరకు తహసీల్దార్లకు రాని లాగిన్‌ అధికారాలు 

పెండింగ్‌ దరఖాస్తుల విషయంలోనూ స్పష్టత కరువు 

50 రోజుల్లో వచ్చినవి 1.47 లక్షల దరఖాస్తులే.. 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ప్రభుత్వ భూములు/స్థలాల క్రమబద్ధీకరణపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, 59ల అమలును పొడిగించినా.. దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు, ఇప్పటికీ మార్గదర్శకాల అంశం తేల్చకపోవడం, రెవెన్యూ అధికారులకు లాగిన్‌ ఇవ్వకపోవడం, గతంలో పెండింగ్‌లో పడ్డ దరఖాస్తుల విషయంగా స్పష్టత రాకపోవడం వంటివి సమస్యగా మారాయి. ఇవేవీ తేలకుండానే దరఖాస్తుల గడువు ముగుస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును పెంచాలని.. మార్గదర్శకాలు ఇచ్చి, ఇతర సమస్యలను సరిదిద్దాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

దరఖాస్తుల స్వీకరణ చేపట్టినా.. 
రాష్ట్రంలో పేదలు ఆక్రమించుకుని, నివాసముంటున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గతంలోనే జీవో 58, 59లను జారీ చేసింది. అప్పట్లో మూడున్నర లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకోగా.. రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవలే మరోసారి క్రమబద్ధీకరణ దరఖాస్తులకు అవకాశమిచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ గడువు గురువారంతో ముగిసిపోతోంది. 50 రోజులకుపైగా అవకాశమిచ్చినా 1.47 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనికి పలు సమస్యలు, ఇబ్బందులకు తోడు ప్రభుత్వం మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకపోవడం కూడా కారణమని విమర్శలు వస్తున్నాయి.  

గడువు ఇవ్వాల్సిందే.. 
భూముల క్రమబద్ధీకరణకు ఇది చివరి అవకాశమని, మరోమారు అవకాశం ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేయాలని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్‌ వస్తోంది.  

ఈ సమస్యలు తేలేదెలా? 
కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే.. 
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59లను విడుదల చేశారు. ఆ జీవోలకు అనుగుణంగా 2014లో దరఖాస్తులు స్వీకరించినప్పడు.. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని భూములకూ వర్తింపజేశారు. కానీ ఈసారి దరఖాస్తులను కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. గ్రామాల పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. పోర్టల్‌లో ఆ ఆప్షనే కనిపించడం లేదు. కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆప్షన్‌ మాత్రమే చూపిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారెవరూ తాజాగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేకపోయినట్టు రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి. 

అధికారులకు లాగిన్‌ ఏదీ? 
దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపునకు వచ్చినా.. రెవెన్యూ వర్గాలకు ఇంతవరకు లాగిన్‌ అధికారం ఇవ్వలేదు. ఏదైనా మండలంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా రెవెన్యూ వర్గాలకు తెలియడం లేదు. ఇక అందిన దరఖాస్తులను పరిశీలించి, తగిన విధంగా లేకుంటే మార్చుకునేలా ప్రజలకు సూచనలు చేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఏవైనా పొరపాట్లు ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

మార్గదర్శకాలపై స్పష్టత లేక.. 
క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఎవరు పరిశీలించాలి? ఎవరు పరిష్కరించాలనే విషయంలోనూ స్పష్టత లేదు. దీనిపై గతంలో ఉన్న మార్గదర్శకాలను అనుసరిస్తారా, లేక కొత్త మార్గదర్శకాలు ఇస్తారా అన్నది ఇప్పటికీ తేలలేదు. 

‘పెండింగ్‌’ సందేహాలు తీర్చేదెవరు? 
2014లో చేసుకున్న దరఖాస్తుల్లో లక్షన్నర వరకు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కొందరు దరఖాస్తులు మాత్రమే చేసుకోగా, మరికొందరు మొదటి, రెండో పేమెంట్‌ కూడా చెల్లించి ఉన్నారు. ఇప్పుడు వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? పాతవాటినే పరిగణనలోకి తీసుకుంటారా అన్నది తేలలేదు. ఇక ప్రభుత్వం ఇటీవల రెండుసార్లు భూముల ధరలను సవరించింది. ఈ క్రమంలో పాత దరఖాస్తులకు కొత్త ధరలు వర్తింపజేస్తారా, పాత రేట్లతోనే క్రమబద్ధీకరిస్తారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. 

బుధవారం నాటికి వచ్చిన దరఖాస్తులివీ.. 
జీవో 58 కింద అందినవి 87,520 
జీవో 59 కింద అందినవి 59,748 
మొత్తం దరఖాస్తులు 1,47,268

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top